డీలిమిటేషన్ పై శరద్ పవార్ పార్టీలో చెలరేగిన అసమ్మతి ఇంకా చల్లారడం లేదు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న పార్టీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)కు చెందిన మరో నేత రాజీనామా చేశారు. పార్టీ వైఖరి తన సైద్ధాంతిక విలువలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ అభయ్ సింగ్ జగతాప్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు సంస్థాగత పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 29) మహారాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శశికాంత్ షిండేకు రాజీనామా లేఖ అందజేశారు.
జగతాప్ ప్రస్తుతం మాన్ ఖటవ్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా, నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న పార్టీ నిర్ణయంతో సైద్ధాంతిక సూత్రాలకు విరుద్ధమని ఆయన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తల త్యాగాలను నాయకత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదే అంశంపై నవంబర్ 27న పార్టీ సోషల్ మీడియా విభాగం మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామేశ్వర్ ఖమ్కర్ కూడా రాజీనామా చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం తనకు ఆమోదయోగ్యం కాదన్నారు. వరుసగా నేతల రాజీనామాతో పార్టీ నిర్ణయంపై అంతర్గతంగా అసమ్మతి తీవ్రమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
ALSO READ : స్టాలిన్ ఇంటికి సోనియా గాంధీ... డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుపై ఉత్కంఠ..!
కాగా, డీలిమిటేషన్ బిల్లుపై చర్చించేందుకు నవంబర్ 30న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం జరగనుంది. ప్రతిపాదిత బిల్లు ద్వారా లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ బిల్లుకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ క్రమంలో బిల్లుపై రాజకీయ పార్టీల వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
